manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 3:54 pm Editor : manabharath

సర్పంచ్ తో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే..

మన భారత్ | ఆదిలాబాద్

 రూ. 34 లక్షలతో నిర్మించిన ఖోడద్ గ్రామ బ్రిడ్జి ప్రారంభం

మౌలిక వసతుల కల్పనే ప్రథమ లక్ష్యం: ఎమ్మెల్యే అనిల్ జాదవ్

తలమడుగు, జూన్ 14: బోథ్ నియోజకవర్గ అభివృద్ధిలో మరో కీలక మైలురాయిగా ఖోడద్ గ్రామంలో రూ. 34 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన బ్రిడ్జిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సర్పంచ్ ప్రియాంక రెడ్డి తో కలిసి శనివారం ప్రారంభించారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తికావడంతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమైంది. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు హాజరై ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు.

ఖోడద్ గ్రామ పరిసర ప్రాంతాల్లో వర్షాకాలం సమయంలో వాగులు పొంగిపొర్లడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవి. ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తరలించడంలో, విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్లడంలో, అత్యవసర సమయాల్లో ప్రజలు ఆసుపత్రులకు చేరుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ఈ సమస్యలను గుర్తించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రత్యేక చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయించారు.

ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి మౌలిక వసతులు అత్యంత కీలకమని అన్నారు. గ్రామాల్లో రహదారులు, వంతెనలు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలు మెరుగుపడితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేయడం తన బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

ఖోడద్ గ్రామ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో గ్రామ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్పారు. రైతులు తమ పంటలను సులభంగా మార్కెట్లకు తరలించగలరని, విద్యార్థులు సురక్షితంగా పాఠశాలలు, కళాశాలలకు వెళ్లగలరని పేర్కొన్నారు. అత్యవసర వైద్య సేవలు అవసరమైన సమయంలో కూడా ప్రజలకు ఇబ్బందులు ఉండవని అన్నారు.

బోథ్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి అభివృద్ధి ఫలాలు చేరేలా తను కట్టుబడి ఉన్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నిధులు సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఎ. ప్రియాంక రెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజల చిరకాల కలను సాకారం చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల గ్రామ ప్రజల రవాణా సమస్యలు శాశ్వతంగా పరిష్కారమవుతాయని అన్నారు. గ్రామ అభివృద్ధికి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు.

కార్యక్రమంలో బోథ్ అధికార ప్రతినిధి కిరణ్ కుమార్, BRS పార్టీ నాయకులు వెంకటేష్, అభిరామ్ రెడ్డి, సాకి ఆనంద్ రావు, కేదారేశ్వర్ రెడ్డి, చందర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ సుధాకర్, రవికాంత్ యాదవ్, అధికారులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు అభినందనలు తెలుపుతూ అభివృద్ధి కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి