manabharath.com
Newspaper Banner
Date of Publish : 13 June 2026, 2:58 am Editor : Editor Vishal Kumar

బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి ఘన వీడ్కోలు..

ప్రజల మనసులు గెలుచుకున్న పోలీస్ అధికారి సేవలకు ప్రశంసల వెల్లువ

మన భారత్, నెల్లిమర్ల:

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న ఎస్ఐ బి. గణేష్‌కు శుక్రవారం ఘన వీడ్కోలు సత్కార కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.

సీఐ రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్ఐ బి. గణేష్ సేవలను పలువురు వక్తలు కొనియాడారు. పోలీసు శాఖలో విధి నిర్వహణ అనేది కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా ప్రజలకు సేవ చేసే అవకాశమని భావించి గణేష్ పనిచేశారని వారు పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ఓపికగా విని పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ ముందుండేవారని గుర్తు చేశారు.

నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ, ప్రజలతో సత్సంబంధాల ఏర్పాటులో ఆయన విశేష కృషి చేశారని నాయకులు అభినందించారు. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసు అధికారిగా గుర్తింపు పొందారని తెలిపారు. ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలు నేరుగా సంప్రదించే విధంగా విశ్వాసాన్ని కల్పించడంలో ఆయన విజయం సాధించారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు చిక్కాల సాంబశివరావు, సముద్రపు రామారావు, సువ్వాడ రవిశేఖర్, లెంక అప్పలనాయుడు, ఆల్తి శ్రీనివాసరావు, చనమల్లు వెంకటరమణ తదితరులు మాట్లాడుతూ, ఎస్ఐ గణేష్ విధి నిర్వహణలో నిష్పక్షపాత ధోరణి అవలంబించారని ప్రశంసించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా మెలుగుతూ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసిన అధికారిగా ఆయన పేరు నిలిచిపోతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో ఎస్ఐ బి. గణేష్‌కు శాలువా కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి, జ్ఞాపికను బహూకరించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల్లిమర్ల ప్రజలు తనకు అందించిన ప్రేమాభిమానాలు జీవితాంతం గుర్తుండిపోతాయని అన్నారు. విధి నిర్వహణలో సహకరించిన ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

పోలీసు శాఖ ప్రజల భద్రత కోసం నిరంతరం కృషి చేస్తుందని, తాను ఎక్కడ విధులు నిర్వహించినా ప్రజాసేవకే ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసం పొందడం తనకు లభించిన అతిపెద్ద గౌరవమని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఐలు గోపాలరావు, సన్యాసినాయుడు, అరుణ్ కిరణ్‌తో పాటు పోలీసు సిబ్బంది, వివిధ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎస్ఐ గణేష్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..