manabharath.com
Newspaper Banner
Date of Publish : 12 June 2026, 7:57 am Editor : manabharath

దళిత హక్కులు, సామాజిక న్యాయం కోసం ఐక్యంగా ముందుకు రావాలి..

దళిత సమర శంఖారావాన్ని విజయవంతం చేయండి: పెంట శంకర్రావు పిలుపు

మన భారత్ | విజయనగరం

విజయనగరం పట్టణంలోని ఎస్.ఎం.బి చర్చిలో శుక్రవారం నిర్వహించనున్న దళిత సమర శంఖారావం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జై భీమ్ రావు పార్టీ గజపతినగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పెంట శంకర్రావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ, దళితుల హక్కులు, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ, అభివృద్ధి వంటి కీలక అంశాలపై చర్చించేందుకు ఈ సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని సంఘమిత్ర డాక్టర్ ఆర్.ఎస్. జాన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సభకు ప్రముఖ న్యాయవాది, హైకోర్టు మాజీ న్యాయమూర్తి, జై భీమ్ రావు భారత పార్టీ జాతీయ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు వెల్లడించారు. ఆయన దళితుల సాధికారత, సామాజిక సమానత్వం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణపై ప్రత్యేకంగా ప్రసంగించనున్నారని తెలిపారు.

దళిత వర్గాలు నేటికీ అనేక సామాజిక, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, వాటి పరిష్కారానికి ఐక్య పోరాటం అవసరమని పెంట శంకర్రావు అన్నారు. విద్య, ఉపాధి, రాజకీయ ప్రాతినిధ్యం, భూహక్కులు, సంక్షేమ పథకాల అమలు వంటి అంశాలపై సభలో విస్తృత చర్చ జరుగుతుందని చెప్పారు.

దళిత క్రైస్తవుల సమస్యలు, రిజర్వేషన్ల అంశం, సామాజిక వివక్ష నిర్మూలన వంటి విషయాలపై కూడా నాయకులు తమ అభిప్రాయాలు వెల్లడిస్తారని తెలిపారు. సమాజంలోని అణగారిన వర్గాలకు న్యాయం జరిగేలా ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉందన్నారు.

ఈ సభకు దళితులు, దళిత క్రైస్తవులు, యువత, మహిళలు, సామాజిక సంఘాల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు. వేలాదిగా ప్రజలు పాల్గొని దళితుల ఐక్యత, ఆత్మగౌరవాన్ని చాటాలని పిలుపునిచ్చారు.

దళిత సమాజ అభ్యున్నతి కోసం చేపడుతున్న ఈ కార్యక్రమం సామాజిక మార్పుకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యులు, మిత్రులతో కలిసి కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..