manabharath.com
Newspaper Banner
Date of Publish : 10 June 2026, 11:00 am Editor : manabharath

బీఆర్‌ఎస్‌కు షాక్.. తెలంగాణ రక్షణ సేనలో చేరిన యువత

సాకేర గ్రామానికి చెందిన 10 మంది యువకుల చేరిక

ప్రజా సమస్యల పరిష్కారమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం: మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన పలువురు యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రక్షణ సేనలో చేరడం స్థానిక రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బోథ్ నియోజకవర్గంలోని సోనాల మండలంలోని సాకేర గ్రామానికి చెందిన 10 మంది యువకులు తెలంగాణ రక్షణ సేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఆ పార్టీలో చేరినట్లు నాయకులు తెలిపారు.

ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర పరిశీలకులు, బోథ్ నియోజకవర్గ ఇంచార్జి రాథోడ్ బాపురావు ఆధ్వర్యంలో ఈ చేరికలు ఘనంగా జరిగాయి. పార్టీలో చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పి నాయకులు ఆత్మీయంగా స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా మీ రాథోడ్ బాపురావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు జరిగినప్పటికీ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, యువతకు ఉపాధి అవకాశాలు, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తోందని పేర్కొన్నారు.

ప్రస్తుతం యువతలో రాజకీయ చైతన్యం పెరుగుతోందని, ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకత్వాన్ని వారు కోరుకుంటున్నారని అన్నారు. అదే కారణంగా తెలంగాణ రక్షణ సేన వైపు యువత ఆకర్షితులవుతున్నారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి యువత కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.

గ్రామ స్థాయిలో ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారం కోసం పోరాడటమే తెలంగాణ రక్షణ సేన ప్రధాన లక్ష్యమని బాపురావు స్పష్టం చేశారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువత ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నిరంతరం ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తోందని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసి ప్రజల నమ్మకాన్ని గెలుచుకునే దిశగా ముందుకు సాగుతామని అన్నారు.

పార్టీలో చేరిన యువకులు మాట్లాడుతూ, తెలంగాణ రక్షణ సేన చేపడుతున్న ప్రజా కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు తమను ఆకట్టుకున్నాయని తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందించే నాయకత్వం ఉన్నందునే పార్టీలో చేరినట్లు పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలుగా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో సంతోష్, కుందూరు సుధాకర్, కైలాస్, రాథోడ్ సాగర్, దిలీప్ జాదవ్, సురేష్, లక్ష్మణ్, కపిల్, రోహిదాస్, దినేష్ కుమార్ తదితరులు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన ప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని చేరికలను స్వాగతించారు.

యువత చేరికలతో తెలంగాణ రక్షణ సేన పార్టీకి ఆదిలాబాద్ జిల్లాలో మరింత బలం చేకూరుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి పార్టీ విస్తరణకు ఈ చేరికలు దోహదపడతాయని పేర్కొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ 

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి