manabharath.com
Newspaper Banner
Date of Publish : 09 June 2026, 5:03 pm Editor : manabharath

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: సర్పంచ్ చంటి

ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో గ్రామస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: సర్పంచ్ ఏలుగు రాజన్న

మన భారత్, తలమడుగు:

ప్రజా సమస్యల పరిష్కారం, గ్రామాభివృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన **ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక** కార్యక్రమంలో భాగంగా తలమడుగు గ్రామపంచాయతీలో సోమవారం గ్రామసభ ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఏలుగు రాజన్న అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వర్షాకాల సన్నద్ధత, సురక్షిత తాగునీటి సరఫరా, ఘన వ్యర్థాల నిర్వహణ, జల సంరక్షణ, వనమహోత్సవం, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), వరద నిర్వహణ భద్రత వంటి అంశాలపై అధికారులు, ప్రజలు సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల ఇనాగ్రేషన్ కార్యక్రమం కూడా నిర్వహించారు. గ్రామాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వారి సమస్యలను అధికారులు నమోదు చేసుకున్నారు.

గ్రామపంచాయతీ కార్యదర్శి గజానన్ మాట్లాడుతూ వర్షాకాలంలో వర్షపు నీటిని వృథా కాకుండా నిల్వ చేసుకోవడం ద్వారా భూగర్భ జలాలు పెరిగి రైతులకు, గ్రామ ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. పొలాల్లో నీరు నిల్వ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే గ్రామంలో నీటి గుంతలు, డ్రైనేజీ సమస్యలు, పారిశుధ్య నిర్వహణ వంటి అంశాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

గ్రామసభలో పాల్గొన్న గ్రామస్తులు తాగునీటి సరఫరా, రహదారుల మరమ్మతులు, పారిశుధ్యం, సంక్షేమ పథకాల అమలు, విద్యుత్ సమస్యలు తదితర అంశాలపై అధికారులను ప్రశ్నించారు. ప్రజల సమస్యలను శ్రద్ధగా విన్న సర్పంచ్ ఏలుగు రాజన్న స్పందిస్తూ, గ్రామస్తులు లేవనెత్తిన ప్రతి సమస్యను సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి, వీలైనంత త్వరగా పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

గ్రామ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం గ్రామసభలు ఎంతో ఉపయోగకరమని, ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ అధికారి లావణ్య, ఎస్ఐ రాధిక, వార్డ్ సభ్యులు, గ్రామపంచాయతీ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ సిబ్బంది, విద్యుత్ శాఖ ఉద్యోగులు, ఫీల్డ్ అసిస్టెంట్, యువత, మహిళలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.