మన భారత్, ఆదిలాబాద్:
ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు
తలమడుగు: గ్రామాల సమగ్ర అభివృద్ధికి గ్రామసభలు కీలక వేదికలని, ప్రజల సమస్యలు సత్వర పరిష్కారం కావాలంటే అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. తలమడుగు మండలంలోని పల్లి(బి) గ్రామంలో శనివారం నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన, గ్రామ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
గ్రామసభలో గ్రామాభివృద్ధి, మౌలిక వసతులు, తాగునీటి సౌకర్యాలు, వ్యవసాయం, విద్యుత్, విద్య, గృహనిర్మాణం, రహదారులు తదితర అంశాలపై గ్రామస్థులతో కలెక్టర్ విస్తృతంగా చర్చించారు. ప్రజలు తమ సమస్యలను, అవసరాలను వివరించగా వాటిని ఓపికగా విని శాఖల వారీగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే వినతులు, ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వర పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గ్రామంలోని అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించిన కలెక్టర్, తాగునీటి సమస్యలు, విద్యుత్ సరఫరా, వ్యవసాయ అవసరాలు, విద్యా సదుపాయాలు, గృహనిర్మాణ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. గ్రామ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు.
గ్రామసభలో తలమడుగు తహసీల్దార్, ఎంపీడీవో, ఎంఈఓ, విద్యుత్ శాఖ ఏఈ, హౌసింగ్ శాఖ ఏఈ, వ్యవసాయ శాఖ ఏవోతో పాటు వివిధ శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వీకరించారు. సమస్యల పరిష్కారంపై శాఖల వారీగా స్పందిస్తూ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కటకం సంజీవ్, ఉపసర్పంచ్ కోరంగ మారుతి, మాజీ సర్పంచ్ కొమరం మల్కు లక్ష్మి, మాజీ సర్పంచ్ కనిపెళ్లి విట్టల్, మాజీ ఎంపీటీసీ మార్స్‌కోళ్ల సోమన్న, పీఏసీఎస్ చైర్మన్ నూకలింగారెడ్డి, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ స్వయంగా గ్రామసభకు హాజరై ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యలను నేరుగా జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు.
గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
