manabharath.com
Newspaper Banner
Date of Publish : 05 June 2026, 10:10 am Editor : Editor Vishal Kumar

నీటిని ఆదా చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

భవిష్యత్తులో వర్షాల కొరత.. నీటిని ఆదా చేయాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: పొన్నం ప్రభాకర్ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్ లో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి తనకు సంబంధం లేదని ఎవరూ భావించవద్దని, భవిష్యత్ తరాల కోసం ప్రతి వ్యక్తి తప్పనిసరిగా ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. ప్రాచీన కాలంలో అశోక చక్రవర్తి చేపట్టిన వృక్షారోపణ కార్యక్రమాలను గుర్తు చేస్తూ, ప్రకృతిని కాపాడటం మనందరి కర్తవ్యమని అన్నారు.

దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన కాలుష్య సమస్యలను ఎదుర్కొంటోందని, హైదరాబాద్‌లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణాన్ని సంరక్షించవచ్చని తెలిపారు.

భవిష్యత్తులో వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించిన మంత్రి, నీటి వనరులను సంరక్షించడం అత్యంత అవసరమని అన్నారు. బోర్లు వేసినా నీరు లభించని పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు చెట్లు నాటాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి, భూమిలో సులభంగా కలిసిపోయే పర్యావరణహిత పదార్థాలను ఉపయోగించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో నవీన్ యాదవ్, ప్రియాంక ఆలా, కర్ణన్ తదితర అధికారులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..