manabharath.com
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 6:59 am Editor : manabharath

మున్నూరు కాపు జిల్లా అధ్యక్షుడిగా తోట శివన్న బాధ్యతల స్వీకారం..

ఆదిలాబాద్ తాలుకా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ఘన ప్రమాణ స్వీకారం

అధ్యక్షుడిగా తోట శివన్న బాధ్యతల స్వీకారం – సంఘ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని హామీ

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ తాలుకా మున్నూరు కాపు సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా తోట శివన్న బాధ్యతలు స్వీకరించగా, ఉపాధ్యక్షుడిగా ఆవుల శరత్, ప్రధాన కార్యదర్శిగా కలమర్గుల సంతోష్, కోశాధికారిగా వడ్డరపు విఠ్ఠల్ ప్రమాణ స్వీకారం చేశారు. సంఘ సభ్యులు, నాయకులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.

ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించిన ఎన్నికల అధికారులకు సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు.

వజ్రమాల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తేజస్విని స్వాగత నృత్యం, కృతిఅధిర ల నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. సభకు హాజరైన వారు కళాకారులను అభినందించారు.

ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు తోట శివన్న మాట్లాడుతూ, తాను తోట సంటెన్న లసుంబాయి–లింగి దంపతులకు ఏడవ సంతానంగా జన్మించి, చిన్నప్పటి నుంచే సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చానని తెలిపారు. గుడి, బడి, తడి వంటి సేవా కార్యక్రమాలతో పాటు మున్నూరు కాపు మిత్ర సేవా సొసైటీ ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించానన్నారు. సంఘ సభ్యుల ఆశీస్సులు, ప్రోత్సాహంతో ఈరోజు ఆదిలాబాద్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.

రాబోయే రెండేళ్లలో సంఘానికి సంబంధించిన సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పనిచేస్తానని హామీ ఇచ్చారు. విద్య, ఉపాధి, సామాజిక సంక్షేమం, యువత అభివృద్ధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. మున్నూరు కాపు సమాజంలో ఐక్యత, సోదరభావం పెంపొందించేందుకు ప్రతి సభ్యుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

శాలువాలతో సన్మానించడం కంటే పెన్నులు, నోట్‌బుక్స్ అందిస్తే అవి పేద విద్యార్థులకు ఉపయోగపడతాయని తోట శివన్న సూచించారు. సమాజ సేవకు ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థుల భవిష్యత్తు కోసం అందరూ తోడ్పాటు అందించాలని కోరారు.

చివరగా “జై విజ్ఞాన్, జై కిసాన్, జై తెలంగాణ, జై మున్నూరు కాపు” నినాదాలతో తన ప్రసంగాన్ని ముగించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగగా, నూతన కమిటీ సంఘాన్ని మరింత బలోపేతం చేస్తుందనే ఆశాభావాన్ని సభ్యులు వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మాజీ మంత్రి జోగు రామన్న, మాజీ టీపీసీసీ అధ్యక్షురాలు గండ్రత్ సుజాత, రాష్ట్ర అధ్యక్షుడు కుప్పం పురుషోత్తం, ముధోల్ అధ్యక్షుడు రోల రమేష్, ఎన్నికల అధికారి గండ్రత్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.

– గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.