జొన్న కొనుగోళ్లను పరిశీలించిన మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్
రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు – ప్రభుత్వంపై విశ్వాసం ఉంచాలని సూచన
మన భారత్, తాంసి: రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని మాజీ డీసీసీబీ చైర్మన్ భోజ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ స్పష్టం చేశారు. బుధవారం తాంసి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును సందర్శించిన వారు జొన్న కొనుగోలు ప్రక్రియను పరిశీలించి రైతులతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భోజ రెడ్డి మాట్లాడుతూ, రైతుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర లభించేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కౌడాల సంతోష్ మాట్లాడుతూ, జొన్న కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలను రైతులు నమ్మవద్దని కోరారు. ప్రభుత్వం రైతుల వద్ద ఉన్న ప్రతి గింజను కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉందని, రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
మార్కెట్ యార్డులో రైతులతో నేరుగా మాట్లాడిన నాయకులు, వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రైతుల శ్రమకు తగిన గుర్తింపు దక్కేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ నారాయణ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు మరియు మార్కెట్ యార్డు సిబ్బంది పాల్గొన్నారు.
📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.
