“మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” – సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి
“ప్రభుత్వ పాఠశాలలే ముద్దు.. ప్రైవేట్ పాఠశాలలు వద్దు” – ప్రధానోపాధ్యాయురాలు భారతి
మన భారత్, ఆదిలాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం సింగారం గ్రామంలో విస్తృత పర్యటన నిర్వహించింది. గ్రామంలో ప్రత్యేక గ్రామసభ ఏర్పాటు చేసి విద్యార్థుల నమోదు, ప్రభుత్వ పాఠశాలల ప్రాధాన్యతపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా సింగారం గ్రామ సర్పంచ్ నాగిరెడ్డి మాట్లాడుతూ, “మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరనే లక్ష్యంతో పనిచేస్తున్నాం” అని అన్నారు. ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలను తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని, విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని పేర్కొన్నారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్‌లో విశాలమైన తరగతి గదులు, నాణ్యమైన విద్యా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, పాలు, రాగిజావ, రుచికరమైన మధ్యాహ్న భోజనం వంటి సదుపాయాలు ప్రభుత్వం కల్పిస్తోందని వివరించారు.
గ్రామసభలో తల్లిదండ్రులతో కలిసి “మన ఊరిలో ఒక్కరు కూడా బడిబయట ఉండరు” అనే బడిబాట ప్రతిజ్ఞ చేయించారు. ప్రతి బాలబాలిక విద్యను పొందేలా గ్రామస్థులంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం రోబోటిక్స్ శిక్షణ, సైన్స్ ల్యాబ్, కరాటే వంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, చదువులో వెనుకబడిన వారికి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతో పాటు విద్యార్థుల ప్రతిభను వెలికితీసే అనేక అవకాశాలు ఉన్నాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సింగారం ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జయప్రకాశ్ నాయక్, ఉపాధ్యాయులు భీమప్ప, దత్తాత్రేయ, భాస్కర్, సాయప్ప పాల్గొన్నారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జాజాపూర్ ఉపాధ్యాయులు ప్రతాప్, మధుసూదన్, భానుప్రకాశ్, లక్ష్మణ్, నరసింహ, నర్సింలు, రఘురాం రెడ్డి, నిర్మల, శశిరేఖ, శ్రీదేవి, శిరీష తదితరులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
గ్రామస్థులు, తల్లిదండ్రులు, విద్యార్థుల భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ బడిబాట కార్యక్రమం ప్రభుత్వ పాఠశాలల పట్ల అవగాహన పెంపొందించడంలో కీలకంగా నిలిచింది.
📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.
