డీఎస్సీ అంటే చంద్రబాబు.. చంద్రబాబు అంటే డీఎస్సీ: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయని ప్రభుత్వం వైసీపీదే
మన భారత్, విజయనగరం: ఐదేళ్ల వైసీపీ పాలనలో లక్షలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, వైసీపీ నాయకులకు డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన మరియు ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తీవ్రంగా విమర్శించారు.
మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నికల హామీ మేరకు 16 వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పారదర్శకంగా నియామకాలు చేపట్టిందన్నారు. నియామకాలు పూర్తయిన నెలల తర్వాత డీఎస్సీలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో ఐదేళ్లపాటు ఒక్క ఉపాధ్యాయ పోస్టును కూడా భర్తీ చేయలేదని, దీంతో ఉపాధ్యాయ నియామకాలు లేకుండా పాలన సాగించిన ప్రభుత్వంగా వైసీపీ చెత్త రికార్డు సొంతం చేసుకుందని విమర్శించారు. ఎన్నికలకు ముందు కేవలం ఆరు వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసి చేతులు దులుపుకున్న విషయాన్ని ప్రజలు మరిచిపోలేదన్నారు.
చంద్రబాబు నాయుడు పాలనలో ఉపాధ్యాయ నియామకాలకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత లభించిందని మంత్రి తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1996, 1998, 2000, 2001, 2002, 2003 సంవత్సరాల్లో ఆరు డీఎస్సీలు నిర్వహించగా, రాష్ట్ర విభజన అనంతరం 2014, 2018లో మరో రెండు డీఎస్సీలు నిర్వహించారని గుర్తుచేశారు. మొత్తం తొమ్మిది డీఎస్సీల ద్వారా రెండు లక్షలకు పైగా ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు.
“డీఎస్సీ అంటే చంద్రబాబు… చంద్రబాబు అంటే డీఎస్సీ” అని వ్యాఖ్యానించిన మంత్రి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో తెలుగుదేశం పార్టీకి ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తొలి సంతకంతో మెగా డీఎస్సీకి శ్రీకారం చుట్టడం తమ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.
వైసీపీ పాలనలో నిర్వహించిన పలు పోటీ పరీక్షలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయని, ముఖ్యంగా గ్రూప్-1 పరీక్షల నిర్వహణ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, నియామక ప్రక్రియలపై వివాదాలు తలెత్తి వ్యవహారం కోర్టుల వరకు వెళ్లిందన్నారు. దీంతో నిరుద్యోగ యువత వైసీపీపై విశ్వాసం కోల్పోయిందని తెలిపారు.
విశ్వవిద్యాలయాలను రాజకీయ కేంద్రాలుగా మార్చి, అర్హత కంటే అనుబంధాలకు ప్రాధాన్యత ఇచ్చి ఉద్యోగాల భర్తీ జరిగిందనే విమర్శలు వైసీపీ పాలనపై ఉన్నాయని మంత్రి ఆరోపించారు. ప్రస్తుతం డీఎస్సీ అంశంపై వైసీపీ చేపడుతున్న ఆందోళనలను రాష్ట్ర యువత, నిరుద్యోగులు నమ్మడం లేదని, అందుకే ఆ పార్టీ నేతలు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు.
📲 మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్‌పై క్లిక్ చేయండి.
