manabharath.com
Newspaper Banner
Date of Publish : 31 May 2026, 11:03 am Editor : manabharath

మొక్కలు నాటి పుట్టినరోజు జరుపుకున్న ఎంపీడీవో..

మన భారత్ | తలమడుగు

ప్రకృతి పరిరక్షణకు సందేశం.. ఎంపీడీఓకు ఘన సన్మానం చేసిన సర్పంచ్ ఈరగొల్లా అశోక్

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని జామిడి గ్రామంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తాంసి మండల ఎంపీడీఓ తమ పుట్టినరోజు సందర్భంగా జామిడి గ్రామంలో రెండు పండ్ల మొక్కలను నాటి వేడుకలను సాదాసీదాగా, సందేశాత్మకంగా జరుపుకున్నారు.

ఈ సందర్భంగా జామిడి గ్రామ సర్పంచ్ ఈరగొల్లా అశోక్ ఎంపీడీఓను శాలువాతో ఘనంగా సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో పుట్టినరోజులు, వివాహ వార్షికోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలను మొక్కలు నాటి జరుపుకోవాలనే ఆలోచనను ఎంపీడీఓ అభినందించారు.

ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ, పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రకృతిని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తి కనీసం ఒక మొక్కను నాటి సంరక్షిస్తే భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించవచ్చని సూచించారు.

అదే విధంగా గూడా గ్రామానికి చెందిన సూరం ఆడేళ్లు (జీపీఓ, సుంకిడి) తమ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని రెండు పండ్ల మొక్కలను వారి మామగారి చేతుల మీదుగా నాటించారు. కుటుంబ వేడుకలను పర్యావరణ పరిరక్షణతో అనుసంధానం చేయడం అభినందనీయమని గ్రామస్థులు కొనియాడారు.

జామిడి గ్రామంలో మొక్కల పెంపకాన్ని ఉద్యమంలా కొనసాగిస్తూ ప్రతి శుభకార్యాన్ని ఒక మొక్కతో ప్రారంభించాలనే సంకల్పంతో గ్రామ ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమం గ్రామంలో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు ఎంపీడీఓకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామానికి విచ్చేసి మొక్కలు నాటినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

గొంటి ముక్కుల ప్రసాద్, రిపోర్టర్, మన భారత్.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰