manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 5:18 am Editor : manabharath

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం.. బొండపల్లిలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్

మన భారత్ | బొండపల్లి

54 వినతులు స్వీకరణ.. విద్యుత్, తాగునీరు, రెవెన్యూ సమస్యల పరిష్కారానికి చర్యలు

విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ సమావేశ భవనంలో శుక్రవారం రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి నేరుగా సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా దర్బార్‌లో మొత్తం 54 వినతులు అందినట్లు తెలిపారు. అందులో సుమారు 90 శాతం వినతులు విద్యుత్ సమస్యలకు సంబంధించినవిగా ఉండగా, మిగిలిన 10 శాతం తాగునీరు, రెవెన్యూ మరియు ఇతర సమస్యలకు సంబంధించినవిగా ఉన్నాయని వివరించారు.

ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతిని పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు చేపడతామని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యంగా విద్యుత్ సరఫరా సమస్యలు, తాగునీటి ఇబ్బందులను వెంటనే పరిష్కరించేలా సంబంధిత శాఖ అధికారులకు సూచనలు జారీ చేసినట్లు తెలిపారు.

రెవెన్యూ శాఖకు సంబంధించిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా సకాలంలో సమస్యలను పరిష్కరించాలని తహసీల్దార్ రాజేశ్వరరావుకు సూచనలు జారీ చేశారు. భూ వివాదాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, సర్వే సమస్యలు వంటి అంశాలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందేలా కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజా సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰