manabharath.com
Newspaper Banner
Date of Publish : 30 May 2026, 4:30 am Editor : manabharath

ఈ పండు కిలో ధర రూ.2.5 లక్షలు.!

మన భారత్ | తెలంగాణ: 

నిర్మల్‌లో పండిన అరుదైన జపాన్ ‘మియాజకి’ మామిడి!

నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో అరుదైన జపాన్‌కు చెందిన ‘మియాజకి’ రకం మామిడి పండ్లు పండించడం విశేషంగా మారింది. ఆయుర్వేద వైద్యుడు సత్యం తన ఆశ్రమ ప్రాంగణంలో ఈ ప్రత్యేక మామిడి మొక్కలను పెంచి విజయవంతంగా ఫలాలు పొందారు.

సత్యం కేరళ రాష్ట్రం నుంచి ఒక్కో మొక్కను సుమారు రూ.10 వేల వ్యయంతో తెప్పించి ఆశ్రమంలో నాటారు. ప్రత్యేక సంరక్షణ, సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడంతో రెండున్నర సంవత్సరాల వ్యవధిలోనే మొక్కలు ఫలాలను ఇచ్చాయి. ప్రస్తుతం ఈ మామిడి పండ్లు కోతకు రావడంతో స్థానికంగా ఆసక్తి నెలకొంది.

‘మియాజకి’ మామిడి ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన మామిడి రకాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పండ్ల ధర కిలోకు రూ.2.5 లక్షలకు పైగా పలుకుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఆకర్షణీయమైన ఎరుపు రంగు, తీపి రుచి, అధిక పోషక విలువలు ఈ రకం మామిడికి ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.

సత్యం ఈ అరుదైన మామిడి పండ్లను స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్‌కు అందజేసి వాటి ప్రత్యేకతలను వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ రకాన్ని స్థానికంగా సాగు చేయడం జిల్లాకు గర్వకారణమని పలువురు అభినందించారు.

అరుదైన పంటల సాగుపై రైతులు దృష్టి సారిస్తే అధిక ఆదాయం సాధించే అవకాశాలు ఉన్నాయని సత్యం తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానం, సరైన సంరక్షణతో విలువైన పంటలను విజయవంతంగా పండించవచ్చని ఆయన పేర్కొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి. 📱📰