manabharath.com
Newspaper Banner
Date of Publish : 29 May 2026, 3:45 pm Editor : manabharath

“శభాష్ ఎస్పీ సర్” అని కామెంట్స్..

నల్ల మట్టి దందాపై యువత ఫిర్యాదు

ఎస్పీకి వాట్సాప్‌లో సమాచారం..

రంగంలోకి దిగిన పోలీసులు

మత్తడి వాగు ప్రాజెక్ట్ వద్ద టిప్పర్ల నిలిపివేత

మన భారత్, ఆదిలాబాద్: తాంసి
మండలంలోని మత్తడి వాగు ప్రాజెక్ట్ పరిసరాల్లో అక్రమంగా నల్ల మట్టి తరలింపు కొనసాగుతోందని స్థానిక యువత జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ అనుమతుల పేరుతో నల్ల మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోందని ఆరోపిస్తూ యువకులు ఫోటోలు, వివరాలను జిల్లా పోలీస్ అధికారులకు పంపినట్లు తెలిసింది.

ఫిర్యాదును సీరియస్‌గా తీసుకున్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వెంటనే సంబంధిత అధికారులను అప్రమత్తం చేయడంతో తాంసి ఎస్సై జీవన్ రెడ్డి పోలీస్ సిబ్బందితో కలిసి మత్తడి వాగు ప్రాజెక్ట్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నల్ల మట్టి తరలిస్తున్న టిప్పర్లను నిలిపివేసి పరిస్థితిని సమీక్షించారు. అక్రమ రవాణాపై విచారణ చేపట్టిన పోలీసులు సంబంధిత అనుమతులు, పత్రాలను పరిశీలించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా ఎస్సై జీవన్ రెడ్డి స్థానికులతో మాట్లాడుతూ.. చీటికిమాటికి ఎస్పీకి ఫోటోలు పంపడం సరికాదని, ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక అధికారులకు ముందుగా సమాచారం ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. అదే సమయంలో ప్రభుత్వ సెలవు దినాల్లో పనులు చేపట్టరాదని స్పష్టం చేశారు. నల్ల మట్టి తరలింపు పనుల సమయంలో సంబంధిత ఇరిగేషన్ శాఖ అధికారులు తప్పనిసరిగా సైట్ వద్ద ఉండాలని సూచించారు.

ఇక నల్ల మట్టి రవాణా వ్యవహారం వెలుగులోకి రావడంతో స్థానిక ప్రజల్లో చర్చ మొదలైంది. అక్రమంగా మట్టి తరలింపుతో ప్రభుత్వ ఆదాయానికి నష్టం జరుగుతోందని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని రోజులుగా భారీ టిప్పర్లతో మట్టి తరలింపు జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

అయితే ఈ వ్యవహారంపై స్పందించిన సంబంధిత ఇరిగేషన్ అధికారులు మట్టి తరలింపుకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. అన్ని నిబంధనలను పాటిస్తూ పనులు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. అయినప్పటికీ స్థానికులు మాత్రం అనుమతుల పేరుతో అక్రమంగా ఎక్కువ మొత్తంలో మట్టి తరలిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

గురువారం పోలీసులు టిప్పర్లను నిలిపివేయడంతో స్థానిక యువత జిల్లా ఎస్పీ చర్యలను ప్రశంసించింది. అక్రమాలకు అడ్డుకట్ట వేయడంలో ఎస్పీ అఖిల్ మహాజన్ కఠినంగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో పలువురు అభినందనలు తెలిపారు. “శభాష్ ఎస్పీ సర్” అంటూ యువత సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తూ మద్దతు ప్రకటించింది.

ఈ ఘటనతో మత్తడి వాగు ప్రాజెక్ట్ ప్రాంతంలో నల్ల మట్టి రవాణాపై మరింత నిఘా అవసరమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..