స్థానిక ఎన్నికలకు శ్రేణులను సిద్ధం చేస్తున్న ప్రధాన పార్టీలు
మున్సిపల్, పంచాయతీ, ఎంఫీటీసీ ఎన్నికల్లో హోరాహోరీ పోరు ఖాయం?
మన భారత్, ఆంధ్ర ప్రదేశ్:
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ఎన్నికల వేడి రాజుకుంటోంది. రాష్ట్రంలో మున్సిపల్, పంచాయతీ, ఎంఫీటీసీ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. తాజాగా మూడు ప్రధాన రాజకీయ పార్టీల అధినేతలు తమ పార్టీ శ్రేణులకు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వడంతో రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.
తెలుగుదేశం పార్టీ మహానాడులో పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలకు సమాయత్తం కావాలని పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. గ్రామస్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు పార్టీని బలోపేతం చేసి అన్ని స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా స్థానిక ఎన్నికల్లో అన్నిచోట్లా పార్టీ తరఫున పోటీ చేయాలని నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామస్థాయిలో పార్టీ బలాన్ని మరింత పెంచాలని సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల రాజమండ్రిలో జరిగిన సమావేశంలో స్థానిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. గ్రామస్థాయిలో పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
మూడు ప్రధాన పార్టీల అధినేతలు ఒకేసారి స్థానిక ఎన్నికలపై దృష్టి సారించడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. ముఖ్యంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంఫీటీసీ స్థానాల్లో ఈసారి త్రిముఖ పోటీ తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడకముందే పార్టీలు వ్యూహ రచనలో నిమగ్నమవడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
