manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 5:25 pm Editor : manabharath

శక్తి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి: ఎస్సై గణేష్

మన భారత్ | నెల్లిమర్ల

విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం ఆల్తిపాలెం గ్రామంలో మహిళల భద్రత, రక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నెల్లిమర్ల ఎస్సై గణేష్ సోమవారం నిర్వహించారు. ఉపాధి హామీ శ్రామికులతో జరిగిన ఈ సమావేశంలో మహిళల రక్షణ కోసం ప్రభుత్వం, పోలీసు శాఖ అందుబాటులో ఉంచిన సేవల గురించి వివరించారు. ముఖ్యంగా మహిళలు అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం పొందేందుకు శక్తి యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్సై గణేష్ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో మహిళల రక్షణ కోసం పోలీసు శాఖ అనేక రకాల సేవలను అందుబాటులోకి తీసుకువచ్చిందని చెప్పారు. అందులో భాగంగా శక్తి యాప్ మహిళలకు అత్యవసర సమయాల్లో భరోసా కల్పించే ఒక కీలక సాధనమని వివరించారు. మహిళలు ఎక్కడికైనా వెళ్లినప్పుడు ప్రమాదం ఉందని అనిపించినా, ఎవరైనా దాడి చేసే పరిస్థితి ఎదురైనా, వెంటనే యాప్‌లో ఉన్న SOS బటన్ నొక్కడం ద్వారా పోలీసులకు సమాచారం చేరి తక్షణమే సహాయక చర్యలు అందుతాయని తెలిపారు.

అలాగే తల్లిదండ్రులు కూడా తమ ఆడపిల్లలు ఈవ్‌టీజింగ్, వేధింపులు లేదా మరే ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపిన వెంటనే ఆలస్యం చేయకుండా పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమస్యలను దాచిపెట్టకుండా వెంటనే ఫిర్యాదు చేస్తే పోలీసులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారని చెప్పారు.

మహిళల రక్షణే మా ప్రథమ కర్తవ్యం అని ఎస్సై గణేష్ స్పష్టం చేశారు. సమాజంలో మహిళలకు భద్రత, భరోసా కల్పించడం పోలీసు శాఖ బాధ్యత అని పేర్కొన్నారు. పురుషులతో సమానంగా మహిళలకు కూడా చట్టపరంగా అనేక హక్కులు, రక్షణలు ఉన్నాయని గుర్తుచేశారు.

మహిళలపై ఎలాంటి దాడి, హింసాత్మక ఘటన జరిగినా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. మహిళలకు పోలీసులు అన్నలుగా అండగా నిలబడి, వారి సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటారని తెలిపారు. నిందితులకు చట్టపరమైన శిక్షలు పడేలా పోలీసులు వ్యవహరిస్తారని భరోసా ఇచ్చారు.

ఎవరూ మహిళలు అభద్రత భావానికి లోనుకాకుండా ధైర్యంగా ముందుకు రావాలని, అవసరమైతే సమీప పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయవచ్చని, లేదా 112 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్, 181 మహిళా హెల్ప్‌లైన్ ద్వారా కూడా సహాయం పొందవచ్చని ఎస్సై గణేష్ తెలిపారు.

ఈ అవగాహన కార్యక్రమంలో మహిళలు, ఉపాధి హామీ శ్రామికులు పాల్గొని శక్తి యాప్ వినియోగంపై వివరాలు తెలుసుకున్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..