manabharath.com
Newspaper Banner
Date of Publish : 25 May 2026, 3:29 pm Editor : manabharath

కార్మికులందరికీ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యాలు కల్పించాలి

సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపల్ కార్యాలయం ముట్టడిస్తాం: సీఐటీయూ హెచ్చరిక

మన భారత్, మల్కాజిగిరి:
కీసర సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు వెంటనే కల్పించాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎం. వసంతకు సీఐటీయూ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయాన్ని సీఐటీయూ కీసర మండల కన్వీనర్ బంగారు నర్సింగరావు వెల్లడించారు.

మున్సిపల్ కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ప్రజలకు సేవలందిస్తున్నప్పటికీ, వారికి కనీస హక్కులు, సంక్షేమ సౌకర్యాలు అందకపోవడం బాధాకరమని సీఐటీయూ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలను మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని కీసర సర్కిల్ డిప్యూటీ కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా బంగారు నర్సింగరావు మాట్లాడుతూ, కీసర సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గతంలో అనేకసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ, సమస్యల పరిష్కారంలో ఎలాంటి పురోగతి కనిపించలేదని విమర్శించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులందరికీ ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యాలు కల్పించడంతో పాటు, కార్మికుల సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని కోరారు.

కార్పొరేషన్‌లో విలీనమైన కార్మికులందరికీ రూ.18,600 కనీస వేతనం అమలు చేయాలని, వారానికి ఒక రోజు సెలవు కల్పించాలని, మున్సిపల్ కిట్లు అందించాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. అదేవిధంగా అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులు, సూపర్వైజర్లు, డ్రైవర్లు, వాటర్ వర్క్స్ సిబ్బంది, ఎలక్ట్రిషియన్లకు గత రెండు నెలలుగా జీతాలు చెల్లించలేదని ఆరోపించింది. పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని అధికారులను డిమాండ్ చేసింది.

మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే జూన్ 8న మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని సీఐటీయూ నాయకులు హెచ్చరించారు. కార్మికుల హక్కుల కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో చింతకింది అశోక్, గడ్డం అశోక్, వనిగంటి మల్లేష్, గడ్డం గోపాల్, మహేష్, మోత్కుపల్లి రాములమ్మ, చెన్నూరి నాగమణి, మునిగడప జయమ్మ, మోత్కుపల్లి అనిత, బోసి పద్మ, కొండాపురం ఎల్లమ్మ, బోర బాలమ్మ, మునిగడప లక్ష్మమ్మ, ఉద్దమర్రి పోచమ్మ, కొలిపాక కనకమ్మ, కందపల్లి అశ్విని తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..