manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 12:51 pm Editor : manabharath

నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి: ఏడీఏ

ఉల్లంఘిస్తే జరిమానాలు, చట్టపరమైన చర్యలు తప్పవు: ఏడీఏ గాలి శ్రీనివాస్ హెచ్చరిక

మన భారత్, విజయనగరం జిల్లా / గజపతినగరం:

రానున్న ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల విక్రయాలు పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించాలని విజయనగరం జిల్లా గజపతినగరం రైతు సేవా కేంద్రంలో జరిగిన సమావేశంలో ఏడీఏ గాలి శ్రీనివాస్ ఎరువుల వ్యాపారులకు స్పష్టమైన సూచనలు జారీ చేశారు. గజపతినగరం, బొండపల్లి, దత్తిరాజేరు, మెంటాడ మండలాలకు చెందిన ఎరువుల డీలర్లతో శనివారం నిర్వహించిన అవగాహన సమావేశంలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పాటించాల్సిన నియమాలు, నిబంధనలను ఆయన వివరించారు.

ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ, డీలర్లు తమ లైసెన్స్‌లో పేర్కొన్న చిరునామాలోనే విక్రయ కేంద్రాలు, గోదాములు నిర్వహించాలని సూచించారు. ప్రతి షాపులో డోర్ నెంబర్, షాప్ బోర్డు, ధరల పట్టిక, స్టాక్ బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అలాగే వ్యాపారం నిర్వహిస్తున్న కంపెనీల ఫారమ్‌లు, ప్రిన్సిపల్ సర్టిఫికెట్లు ముందుగానే లైసెన్స్‌లో నమోదు చేయించుకోవాలని, అనుమతించిన సంస్థల నుంచే సరుకులు కొనుగోలు చేసి వాటి ఇన్వాయిస్‌లను రికార్డులో ఉంచాలని తెలిపారు.

ప్రతి అమ్మకానికి తప్పనిసరిగా బిల్ జారీ చేయాలని, రైతుల సంతకాలు తీసుకోవాలని, ఎరువుల విక్రయాలను వెంటనే ఈ-పాస్ మిషన్‌లో నమోదు చేయాలని పేర్కొన్నారు. ఎంఆర్పీ కంటే అధిక ధరలకు విక్రయాలు చేయరాదని స్పష్టం చేశారు. అలాగే ఎరువులు లేదా పురుగుమందులతో పాటు లింక్ ప్రొడక్టులు, బయో ఉత్పత్తులను రైతులపై బలవంతంగా అమ్మరాదని హెచ్చరించారు.

డీలర్లు రోజువారీ అమ్మకాలను స్టాక్ రిజిస్టర్‌లో నమోదు చేయాలని, గోదాములో ఉన్న నిల్వలు, ఆన్‌లైన్ రికార్డులు, రిజిస్టర్‌లలో ఎటువంటి తేడాలు ఉండకూడదన్నారు. రాష్ట్రస్థాయిలో ప్రతి నెల ఎరువుల అమ్మకాలపై పర్యవేక్షణ జరుగుతోందని, అధిక పరిమాణంలో విక్రయాలు చేసిన డీలర్లు, కొనుగోలుదారులకు నోటీసులు జారీ చేసి విచారణలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

మండలాల వారీగా పంటల విస్తీర్ణాన్ని బట్టి ఎరువులు కేటాయిస్తున్నందున ఇతర మండలాల వ్యక్తులకు ఎరువులు విక్రయించరాదని ఆయన తెలిపారు. పురుగుమందుల డీలర్లు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన, వ్యవసాయ కమిషనర్ సూచించిన కంపెనీల బయో ఉత్పత్తులను మాత్రమే విక్రయించాలని, కోర్టు అనుమతుల పేరుతో ఇతర బయో ఉత్పత్తులు అమ్మరాదని పేర్కొన్నారు.

డీలర్లు ప్రతి నెల 3వ తేదీలోపు అమ్మకాలు, స్టాక్ నివేదికలను మండల వ్యవసాయ కార్యాలయానికి అందజేయాలని, ఉన్నతాధికారులు కోరిన సమాచారాన్ని తక్షణమే సమర్పించాలని సూచించారు. తనిఖీల సమయంలో పూర్తిగా సహకరించాలన్నారు. ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత ప్యాకింగ్‌లలో మాత్రమే విక్రయించాలి, లూజ్ ప్యాకింగ్‌లో అమ్మరాదని హెచ్చరించారు.

ప్రతి విక్రయం రికార్డుల్లో నమోదు కావాలని, వాటి నాణ్యతకు డీలర్లే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. క్యాష్‌లెస్ లావాదేవీలను ప్రోత్సహిస్తూ UPI QR కోడ్ బోర్డులు అందుబాటులో ఉంచాలని సూచించారు.

అదేవిధంగా, యూరియా, డీఏపీ విక్రయాలు తప్పనిసరిగా కార్డుల ద్వారా మాత్రమే జరపాలని, కార్డు లేని రైతులను రైతు భరోసా కేంద్రాలకు పంపించి కార్డులు ఇప్పించేలా చూడాలని పేర్కొన్నారు. యూరియా కార్డు వివరాల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి, కార్డు నెంబర్ వారీగా ఎన్ని బస్తాలు ఇచ్చారో నమోదు చేయాలని ఆదేశించారు.

పై సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ డీలర్లు చట్టబద్ధంగా విక్రయాలు నిర్వహించాలని, లేనిపక్షంలో కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏడీఏ గాలి శ్రీనివాస్ హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల వ్యవసాయ అధికారులు కిరణ్ కుమార్, కె. గోవిందమ్మ, పి. చంద్రకళ, కె. గోకుల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..