manabharath.com
Newspaper Banner
Date of Publish : 23 May 2026, 9:44 am Editor : manabharath

చలివేంద్రం ప్రారంభించిన ఎస్సై సాయి క్రిష్ణ..

ప్రయాణికుల దాహం తీర్చేందుకు గంట్యాడ పోలీసుల చలివేంద్రం ఏర్పాటు

మన భారత్ | విజయనగరం జిల్లా: వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న నేపథ్యంలో ప్రయాణికుల దాహం తీర్చేందుకు విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో గంట్యాడ పోలీస్ స్టేషన్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా ఎస్పీ ఏ.ఆర్. దామోదర్, ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎన్‌హెచ్ 516-E రహదారిపై ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులకు ఉపశమనం కలిగించేలా ఈ చలివేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

గంట్యాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రాన్ని గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన ప్రయాణికులకు మజ్జిగ అందజేసి దాహం తీర్చే సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. మండుతున్న ఎండల్లో ప్రయాణించే ప్రజలకు చల్లని మజ్జిగ అందించడం ద్వారా ఉపశమనం కలిగించడంతో ప్రయాణికులు పోలీసుల సేవాభావాన్ని అభినందించారు.

ఈ సందర్భంగా గంట్యాడ ఎస్సై డి. సాయికృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప మిగతా సమయాల్లో ఎండలో బయటకు రావద్దని సూచించారు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ తగిలే ప్రమాదం ఉన్నందున ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

అత్యవసర పనుల నిమిత్తం బయటకు వెళ్లాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటర్ బాటిల్ వెంట తీసుకెళ్లాలని, శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలని సూచించారు. అలాగే తలపై గుడ్డ లేదా క్యాప్ ధరించడం, నీడలో విశ్రాంతి తీసుకోవడం, వడదెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు అవగాహన కల్పించారు.

ప్రజల సంక్షేమం కోసం పోలీసులు కేవలం శాంతిభద్రతల పరిరక్షణలోనే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా ముందుండడం అభినందనీయమని స్థానికులు అభిప్రాయపడ్డారు. రహదారిపై ప్రయాణించే వాహనదారులకు ఈ చలివేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో గంట్యాడ ఏఎస్ఐ ఎం. రమణ, స్టేషన్ రైటర్ ఐ. కృష్ణ, పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..