manabharath.com
Newspaper Banner
Date of Publish : 22 May 2026, 9:11 am Editor : manabharath

బదిలీల షెడ్యూల్ వెంటనే ప్రకటించాలి:చట్ల ప్రవీణ్ కుమార్

మన భారత్, ఆదిలాబాద్:

తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖలో ఉద్యోగులు, అధ్యాపకుల బదిలీలకు సంబంధించి ఇప్పటికీ షెడ్యూల్ ప్రకటించకపోవడం పట్ల తెలంగాణ గెజిటెడ్ జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ (TGJLA-475) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇతర శాఖల్లో బదిలీల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, ఇంటర్ విద్యాశాఖ మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి షెడ్యూల్ విడుదల చేయకపోవడం వల్ల అధ్యాపకులు, ఉద్యోగులు మానసిక ఆవేదనకు గురవుతున్నారని అసోసియేషన్ నాయకులు పేర్కొన్నారు.

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి A. Revanth Reddy మరియు విద్యాశాఖ మంత్రికి TGJLA-475 రాష్ట్ర కమిటీ తరఫున ఆన్‌లైన్‌లో వినతిపత్రం పంపించినట్లు ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షులు చట్ల ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ఆర్థిక శాఖ జారీ చేసిన జీవో నెం.38 ప్రకారం మే 1 నుంచి మే 31 వరకు అన్ని ప్రభుత్వ శాఖల్లో బదిలీలు చేసుకోవచ్చని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు.

అలాగే విద్యాశాఖ కార్యదర్శి కార్యాలయం నుంచి మెమో నెం.103/MC/2026 ద్వారా బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ, ఇంటర్ విద్యాశాఖలో మాత్రం ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకటించకపోవడం పట్ల అసోసియేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ విషయమై రాష్ట్ర కమిటీ పలుమార్లు డిపార్ట్మెంట్ అధికారులను సంప్రదించినప్పటికీ ఎలాంటి స్పందన లేదని ఆరోపించారు.

సాంకేతిక కారణాలు ఉన్నా కండిషనల్ ట్రాన్స్‌ఫర్స్ షెడ్యూల్ ప్రకటించి బదిలీల ప్రక్రియను చేపట్టాలని అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు ప్రస్తుతం అమలులో ఉన్న మూడు సంవత్సరాల నిబంధనను తొలగించి, రెండు సంవత్సరాల సేవా నిబంధనను అమలు చేయాలని కోరారు. లేదా బదిలీల కటాఫ్ తేదీని మే 3, 2026గా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

ఈ అంశంపై ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి సానుకూలంగా స్పందించి వెంటనే ఇంటర్ విద్యాశాఖలో బదిలీల షెడ్యూల్ ప్రకటించాలని కోరుతూ విద్యాశాఖ కార్యదర్శి, ఇంటర్ విద్య డైరెక్టర్‌కు కూడా రాష్ట్ర కమిటీ తరఫున ఆన్‌లైన్‌లో వినతిపత్రాలు పంపినట్లు తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యాశాఖలో బదిలీల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల ఉద్యోగులు, అధ్యాపకుల్లో అనిశ్చితి నెలకొందని, వెంటనే షెడ్యూల్ ప్రకటించి సమస్యను పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా TGJLA-475 అసోసియేషన్ తరఫున జిల్లా అధ్యక్షులు చట్ల ప్రవీణ్ కుమార్, ప్రధాన కార్యదర్శి ఉపేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్, కౌన్సిల్ సభ్యులు నరసయ్య, శ్రీనివాస్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్స్ అశోక్ రెడ్డి, డాక్టర్ గోవర్ధన్, అసోసియేట్ ప్రెసిడెంట్స్ సోమన్న, ప్రవీణ్, ట్రెజరర్ రాజేశ్వర్, మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ వహీద్ ఖాన్, లేడీ ప్రెసిడెంట్ ప్రభావతి రెడ్డి తదితరులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..